అత్రి మహాముని ఆశ్రమానికి త్రిమూర్తులు సాదు పుంగవుల వేషం లో అతిధులు గా ప్రవేశించి
" భవతి బిక్షాందేహి " అని అర్ధించారు .
అనసూయ మాత బిక్షను తీసుకు రాగ ,వారు నగ్న దేహి గా వడ్డిస్తేనే బిక్ష గైకొనెదమని మాత కు సెలవిచ్చెను .
పర పురుషుల ముందు నగ్నం గా వడ్డించటం పాతివ్రత్యానికి భంగం , అలా అని అతిధులను నిరాధరించటం మహా పాపం.
వచ్చిన వారు సామాన్యులు కాదని అనసూయ మాత గ్రహించెను ,"భవతి' అని పిలిచారు కావున వారు తన బిడ్డలతో సమానం .
మనసులో అత్రి మహా మునిని స్మరించుకొని తన పాతివ్రత్య మహిమచే ముల్లోకాలను పాలించే బ్రహ్మ- విష్ణు - మహేశ్వరులను పసిబిడ్డలు గా మార్చి ,నగ్నముగా పాలించే ప్రభువులకు పాలిచ్చి వారిని ఉయ్యాలలో పరున్డబెట్టేను.
పతులను గానరాక అత్రి ఆశ్రమానికి వచ్చిన ముగ్గురమ్మలకు ఉయ్యాలలో పడుకొని ఆడుకుంటున్న తమ పతులు కనిపించారు.
శక్తి స్వరూపినులైన ముగ్గురమ్మలు తమ శక్తి తో త్రిమూర్తులను మామూలు రూపానికి తేవటానికి శతవిధాల ప్రయత్నించి విఫలులైనారు.అనసూయ మాత పాతివ్రత్యాన్ని గ్రహించి ఆమె మహత్యాన్ని వేన్నోళ్ల పొగిడి పతి బిక్ష పెట్టమని ప్రార్ధించారు .
అనసూయ మాత అనుగ్రహం తో మళ్ళీ త్రిమూర్తులు యథా రూపాన్ని పొందారు .ఆమె పతి భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నారు .ఆమె తన భర్త కోరిక తన కోరిక ఒకటే అని అదే త్రిమూర్తుల అంశతో బిడ్డను పొందాలనే కోరిక వెలిబుచ్చారు. వారు తథాస్తు అని దీవించారు .
బ్రహ్మ అంశ తో - సోముడు (చంద్రుడు) , విష్ణు అంశ తో - దత్తాత్రేయుడు , శివ అంశ తో - దుర్వాసుడు ,అత్రి అనసూయ దంపతులకు జన్మించారు .